గంజాయిని ధ్వంసం చేయాలన్న తిప్పలే..

గంజాయిని ధ్వంసం చేయాలన్న తిప్పలే..
  • కాలబెట్టేందుకూ తిప్పలే..
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11 టన్నుల నిల్వలు
  • ధ్వంసం చేసేందుకు కిలోకు రూ. 80 అడిగిన రాంకీ సంస్థ
  • రూ. 50 చొప్పున ఇవ్వాలన్న ఏడబ్ల్యూఎం కంపెనీ
  • ఉన్నతాధికారుల జోక్యం
  •  సీఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ కింద గంజాయిని ధ్వంసం చేసేందుకు ఒప్పందం

 ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్సైజ్‌‌‌‌ ఆఫీసర్లు, పోలీస్‌‌‌‌లు పట్టుకున్న గంజాయిని వదిలించుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాలుగేండ్లలో పట్టుకున్న క్వింటాళ్ల కొద్దీ గంజాయిని కాలబెట్టేందుకు లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ పోలీస్‌‌‌‌ స్టేషన్ల పరిధిలో నాలుగేండ్లలో పట్టుకున్న గంజాయి 11 టన్నులకు చేరుకుంది. దీంతో దాన్ని నిల్వ చేయడం తలకు మించిన భారంగా మారడంతో ధ్వంసం చేసేందుకు నిర్ణయించారు.

లక్షల్లో ఖర్చు

పొల్యూషన్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ బోర్డు రూల్స్‌‌‌‌ ప్రకారం గంజాయిని ధ్వంసం చేయాల్సి ఉండడంతో ఉన్నతాధికారులు పలు మార్గాలను అన్వేషించారు. గంజాయిని ధ్వంసం చేసేందుకు హైదరాబాద్‌‌‌‌లోని సాలిడ్‌‌‌‌, డ్రై వేస్ట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కంపెనీలను సంప్రదించారు. ఇందులో రాంకీ సంస్థ కిలోకు రూ.80 చొప్పున చెల్లించాలని డిమాండ్‌‌‌‌ చేసింది.

దీంతో అంత ఖర్చు చేసేందుకు సిద్ధంగా లేని ఆఫీసర్లు తల్లాడ మండలం గోపాల్‌‌‌‌పేటలోని అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కన్సల్టింగ్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ (ఏడబ్ల్యూఎం) అనే కంపెనీని సంప్రదించారు. ఈ కంపెనీ కిలోకు రూ.50 చొప్పున చెల్లించాలని కోరింది. ఉన్నతాధికారుల జోక్యం చేసుకోవడంతో కార్పొరేట్‌‌‌‌ సోషల్‌‌‌‌ రెస్పాన్సిబిలిటీ కింద ఏడాది పాటు ఉచితంగా గంజాయిని ధ్వంసం చేసేందుకు ఒప్పుకుంది. దీంతో రెండు వారాలుగా గంజాయిని ధ్వంసం చేయడం మొదలు పెట్టారు. ఇప్పటివరకు 2,700 కిలోల గంజాయిని ధ్వంసం చేశారు.

850 నుంచి 1100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కాల్చివేత

పొల్యూషన్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ బోర్డ్‌‌‌‌ రూల్స్‌‌‌‌ ప్రకారం గంజాయిని బహిరంగంగా కాల్చడం గానీ, భూమిలో పాతిపెట్టడం గానీ చేయకూడదు. దీంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంపెనీల్లోనే అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద గంజాయిని కాల్చి వేయాల్సి ఉంటుంది.

ఇన్సినరేషన్‌‌‌‌ మెథడ్‌‌‌‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఫర్నేస్‌‌‌‌లో 850 నుంచి 1,100 డిగ్రీల సెంటీగ్రేడ్‌‌‌‌ దగ్గర గంజాయిని కాల్చివేస్తారు. దీని వల్ల తక్కువ మొత్తంలో బూడిద మిగులుతుంది. ఈ మెథడ్‌‌‌‌లో కాల్చివేసిన తర్వాత వెలువడే గ్యాస్‌‌‌‌లను శుద్ధి చేసిన తర్వాతే గాల్లోకి వదులుతారు. ఇలా ఒకేసారి వెయ్యి కిలోల గంజాయిని ధ్వంసం చేసేందుకు వీలు ఉంది.

అయితే ఏడబ్ల్యూఎం కంపెనీ ఇప్పటికే ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్‌‌‌‌ జిల్లా హాస్పిటల్స్‌‌‌‌లో వెలువడే మెడికల్‌‌‌‌ వేస్టేజ్‌‌‌‌ను ధ్వంసం చేస్తుంది. దీంతో మూడు, నాలుగు రోజులకు ఒకసారి చొప్పున రెగ్యులర్‌‌‌‌ మెడికల్‌‌‌‌ వేస్టేజ్‌‌‌‌ లేని టైంలో గంజాయిని ధ్వంసం చేసేందుకు కంపెనీ ముందుకువచ్చింది. ఇప్పటివరకు 2,700 కిలోలు ధ్వంసం చేయగా, మిగిలిన 9 వేల కిలోల గంజాయిని ధ్వంసం చేసేందుకు మరో మూడు వారాలు పట్టే అవకాశం ఉంది.


డీడీసీ పర్మిషన్‌‌‌‌తోనే...

ప్రతి జిల్లాకు డ్రగ్‌‌‌‌ డిస్పోజబుల్‌‌‌‌ కమిటీ (డీడీసీ) ఉంటుంది. కమిటీ చైర్మన్‌‌‌‌గా ఎక్సైజ్‌‌‌‌ డిప్యూటీ కమిషనర్‌‌‌‌,  సభ్యులుగా అసిస్టెంట్‌‌‌‌ కమిషనర్‌‌‌‌, జిల్లా ఎక్సైజ్‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌ ఉంటారు. స్టేషన్ల వారీగా నమోదైన కేసులు, పట్టుకున్న గంజాయికి సంబంధించిన వివరాలను ఎక్సైజ్‌‌‌‌ సీఐలు కమిటీకి రిపోర్ట్‌‌‌‌ ఇస్తారు. డ్రగ్‌‌‌‌ డిస్పోజల్‌‌‌‌ కమిటీ పర్మిషన్‌‌‌‌తో రూల్స్‌‌‌‌ ప్రకారం గంజాయిని ధ్వంసం చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగేండ్లుగా గంజాయిని ధ్వంసం చేయకపోవడంతో ఆయా స్టేషన్లలో నిల్వలు భారీగా పేరుకుపోయాయి.